షకీబ్‌, దీపక్‌ వాట్సప్‌ సందేశాలు బహిర్గతం

Prajasakti

Prajasakti

Author 2019-10-31 04:41:40

img

- స్వంత గ్రామంలో అభిమానుల మానవహారం
ఢాకా : బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌-అల్‌-హసన్‌, భారత బుకీ దీపక్‌ అగర్వాల్‌ మధ్య జరిగిన వాట్సప్‌ సందేశాలు బహిర్గతమయ్యాయి. ఓ వ్యక్తి ద్వారా షకీబ్‌ ఫోన్‌ నంబర్‌ను సంపాదించిన దీపక్‌ పలుసార్లు వాట్సప్‌లో మెసేజ్‌లు పంపి 2017 బంగ్లాదేశ్‌ ప్రిమియర్‌ లీగ్‌(బిపిఎల్‌) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి ఫోన్‌లో సంప్రదించాడు. ఆ తర్వాత 2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైనందుకు షకీబ్‌కు అభినందనలు తెలుపుతూ జనవరి 19న దీపక్‌ మెసేజ్‌ చేశాడు. 'మనం ఇప్పుడు కలిసి పనిచేద్దామా లేక ఐపిఎల్‌ వరకు వేచి ఉండాలా?' అని ఆ సందేశంలో అడిగాడు. ఇక్కడ 'పనిచేద్దామా' అనే పదం ఆ సిరీస్‌లో బంగ్లా జట్టు అంతర్గత ప్రణాళిక సమాచారాన్ని తెలుసుకోవడమే అర్ధంలో ఐసిసి విచారణ అధికారులు భావించారు. అలాగే జనవరి 23న 'బ్రో ఈ సిరీస్‌లో ఏమైనా ఉందా?' అని మెసేజ్‌ చేశాడు. ఇక ఐపిఎల్‌ సందర్భంగా ఏప్రిల్‌ 26న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మరోసారి దీపక్‌ అడిగాడు. ఈ సందర్భంగా వారి మధ్య బిల్‌కాయిన్స్‌, డాలర్‌ అకౌంట్స్‌ సమాచారంపై సంభాషణలు జరిగాయి. అయితే, షకీబ్‌ మాత్రం దీపక్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు ఆసక్తి చూపించాడు. అప్పుడు జరిగిన సంభాషణ మొత్తం డిలీట్‌ అయ్యిందని, అందులో జట్టు అంతర్గత సమాచారం ఇవ్వాలని దీపక్‌ కోరినట్లు షకీబ్‌ విచారణ అధికారుల వద్ద అంగీకరించాడు.
షకీబ్‌ సొంతపట్టణమైన మగురాలో దాదాపు 700మందితో మానవహారం నిర్మించి, నిరసన వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు. 'నిరసనకారులు నినాదాలు చేస్తూ హైవేపై పాదయాత్ర చేశారు. ఐసిసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మానవహారం నిర్మించారు' అని పోలీస్‌ అధికారి సైఫుల్‌ ఇస్లాం తెలిపారు.
బంగ్లా టీ20 కెప్టెన్‌గా మహ్మదుల్లా
బంగ్లాదేశ్‌ టీ20 కెప్టెన్‌గా ఆల్‌ రౌండర్‌ మహ్మదుల్లా ఎంపికయ్యాడు. తొలుత ప్రకటించిన బంగ్లాదేశ్‌ జట్టుకు కెప్టెన్‌గా షకీబ్‌ ఎంపికైనా అతనిపై ఐసిసి రెండేళ్ల నిషేధం విధించడంతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) పగ్గాలను బుధవారం మహ్మదుల్లాకు అప్పగిం చింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ వ్యక్తిగత కారణాలతో సిరీస్‌కు దూరంగా కాగా... ఆల్‌రౌండర్‌ షకీబ్‌ కూడా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటేనని చెప్పవచ్చు.
బంగ్లా టీ20 జట్టు : మహ్మదుల్లా (కెప్టెన్‌), లింటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీమ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, ఆతిఫ్‌ హొసైన్‌, ముసద్దెక్‌ హొసైన్‌, అనీముల్‌ ఇస్లామ్‌, అరాఫత్‌ సన్నీ, అల్‌-అమిన్‌, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, షఫీవుల్‌ ఇస్లామ్‌, మహ్మద్‌ మిథున్‌, తైజుల్‌ ఇస్లామ్‌, అబు హైదర్‌ రూనీ.

- షకీబ్‌కు బంగ్లా ఆటగాళ్ల మద్దతు
ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌ జట్టు వికెట్‌ కీపర్‌ ముష్ఫ్రికర్‌ రహీమ్‌, పేస్‌ బౌలర్‌ మొర్తాజాలు షకీబ్‌కు మద్దతుగా నిలిచారు. అంతేగాక వీరు బుధవారం ఓ భావోద్వేగపూరిత పోస్టులనూ పెట్టారు. '18ఏళ్ల పాటు కలిసి ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా ఆడటాన్ని ఊహించుకోవడం బాధగా ఉంది. ఛాంపియన్‌గా మళ్ళీ తిరిగి వస్తావని ఆశిస్తున్నా... నీకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. అలాగే దేశం మద్దతు కూడా ఉంటుంది. ధైర్యంగా ఉండు' అని ముష్ఫికర్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక మొర్తాజా అయితే... షకీబ్‌పై జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా తనకు కొన్ని రాత్రులు నిద్రపట్టదని, అతని సారథ్యంలో 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడతామనే ఆశతో నిద్రిస్తానని భావోద్వేగంతో చెప్పాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు, ప్రధాని హసీనా సైతం మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN