షమీ తెలివి.. పిచ్ పగులుతో వికెట్ ఎగిరింది

Telangana News

Telangana News

Author 2019-10-06 17:11:22

imgThird party image reference

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. వైజాగ్ టెస్టులో దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ని వణికించాడు. షమీ విసిరిన బంతులకి సమాధానం ఇవ్వలేకపోయిన డుప్లెసిస్, బవుమా, డికాక్ క్లీన్ బౌల్డయ్యారు.

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తెలివైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లో ఆఖరి రోజైన ఆదివారం పిచ్ నుంచి కొద్దిగా సహకారం లభించడంతో రెచ్చిపోయిన మహ్మద్ షమీ.. బవుమా, డుప్లెసిస్, డికాక్ రూపంలో ముగ్గురు సఫారీ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను బోల్తా కొట్టించేశాడు. షమీ విసిరిన బంతుల్ని అడ్డుకోలేకపోయిన ఈ ముగ్గురూ క్లీన్ బౌల్డవడం విశేషం. దీంతో.. 395 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఈరోజు లంచ్ విరామ సమయానికి 117/8తో ఓటమికి చేరువలో ఉంది.

ఈరోజు ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన బవుమా (0: 2 బంతుల్లో) డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అనూహ్య టర్న్ తీసుకున్న బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి వికెట్లను గీరాటేసింది. ఈ బంతిని ఆడే క్రమంలో బవుమా క్రీజులోనే కుప్పకూలిపోయాడు. కానీ.. బంతిని మాత్రం అడ్డుకోలేకపోయాడు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ (13: 26 బంతుల్లో 3x4)‌ని షమీ బౌల్డ్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా.. పిచ్‌పై ఉన్న చిన్న పగులు మీద షమీ బంతి విసిరాడు. దీంతో.. ఆ బంతి స్టంప్స్‌కి దూరంగా వెళ్తుందని ఊహించిన డుప్లెసిస్.. బంతి ఆడకుండా విడిచిపెట్టాడు. కానీ.. పగులు కారణంగా అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి ఆఫ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. దీంతో.. నోరెళ్లబెట్టడం డుప్లెసిస్ వంతైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన డికాక్‌(0)కి దాదాపు ఇదే పరిస్థితి. ఆఫ్ స్టంప్‌ లైన్‌పై వచ్చిన బంతిని ఆడటంలో డికాక్ విఫలమవగా.. బంతి వికెట్లను గీరాటేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN