సఫారీల శతక బాదుడు

Prajasakti

Prajasakti

Author 2019-10-05 03:38:55

img

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో
ఎసిఎ- విడిసిఎ వేదికగా జరుగుతున్న భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలిటెస్టు రసవత్తరంగా సాగుతోంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమ్‌ ఇండియాకు సఫారీలు దీటుగా సమాధానమిస్తున్నారు. ఓపెనర్‌ ఎల్గర్‌ 160 (287 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్స్‌లు), వికెట్‌ కీపర్‌ డికాక్‌ 111 (163 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) శత కాలతో కదం తొక్కగా తొలిపోరు అసక్తికరంగా మారింది. మూడో రోజు ఆటముగిసే సరికి దక్షిణాఫ్రికా 385/8తో పోటీలో నిలిచింది. భారత్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (128/5) ఐదు వికెట్లతో సత్తా చాటుకున్నాడు.
దక్షిణాఫ్రికా మూడోరోజు శుక్రవారం ఉదయం ఓవర్‌నైట్‌ స్కోరు 39/3తో ఆట ఆరంభించిన కొద్ది సమయానికే ఇషాంత్‌శర్మ దెబ్బ తీశాడు. బవుమా(18)ను వికెట్ల ముందు అవుట్‌ చేశాడు. తరువాత బరిలోకి దిగిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ 55 (103 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌ర్‌)తో కలిసి ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అశ్విన్‌ విడదీశాడు. అతని బౌలింగ్‌లో షాట్‌ ఆడటానికి ప్రయత్నించిన డుప్లెసిస్‌ లెగ్‌స్లిప్‌లో ఉన్న పుజారా చేతికి చిక్కడంతో 178 పరుగులకే దక్షిణాఫ్రికా సగం వికెట్లను కోల్పోయింది.
రెండు సెంచరీలు నమోదు
దక్షిణాఫ్రికా కష్టాల్లో కూరుకుపోతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన డికాక్‌తో కలిసి ఎల్గర్‌ భారత్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముచ్చటైన షాట్లతో అలరిస్తూ ఎల్గర్‌ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. డికాక్‌ కూడా తనదైన శైలిలో చెలరేగడంతో పరుగులు వరద పారింది. ఎల్గర్‌ను జడేజా బోల్తా కొట్టించి వీరద్దరి భాగస్వామ్యాన్నికి తెరదించాడు. డికాక్‌, ఎల్గర్‌ ఆరో వికెట్‌కు 164 పరుగులు జోడించారు. ఎల్గర్‌ అవుటైన కొద్దిసేపటికే డికాక్‌ సెంచరీ సాధించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది శతకాన్ని అందుకున్నాడు. తర్వాత డికాక్‌ను అశ్విన్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఫిలాండర్‌ను కూడా అతడు పెవిలియన్‌కు పంపించడంతో ఆఖరి సెషన్‌లో సఫారీలు మూడు వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుస్వామి(12 నాటౌట్‌), మహరాజ్‌(3 నాటౌట్‌) ఉన్నారు. భారత్‌ కంటే దక్షిణాఫ్రికా ఇంకా 117 పరుగులు వెనుకబడి ఉంది. భారత్‌ బౌలర్లలో ఆశ్విన్‌ ఐదు వికెట్లు, జడేజా రెండు, ఇషాంత్‌శర్మ ఒక్క వికెట్‌ తీసుకున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ జరుగుతున్న సమయంలో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీని కలిసి సెల్ఫీ దిగుదామని మైదానంలోకి వచ్చిన ఒక అభిమానిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి మీసాల నారాయణ అత్యుత్సాహం ప్రదర్శించి మైదానంలోకి ప్రవేశించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN