సమిష్టి విజయం రోహిత్‌ శర్మ

Prajasakti

Prajasakti

Author 2019-10-08 03:35:34

img

(ప్రజాశక్తి స్పోర్ట్స్‌ డెస్క్‌):
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి ఎగబాకాడు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై రెండు వరుస శతకాలతో చెలరేగి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను కైవసం చేసుకోవడంతో తొలిసారి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌ 28 టెస్టుల్లో 36 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి కేవలం ఐదు సెంచరీలను మాత్రమే చేయగలిగాడు. కానీ విశాఖలో తొలిసారి మిడిల్‌ ఆర్డర్‌లో కాకుండా ఓపెనర్‌గా బరిలోకి దిగి రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలతో కదం తొక్కడం విశేషం.

షమి బౌలింగ్‌ భేష్‌...
పిచ్‌ పరిస్థితిని చక్కగా అర్ధం చేసుకున్న పేసర్‌ షమి తన బౌలింగ్‌ పవర్‌ చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీసినా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను ఖాతాలో వేసుకుని సఫారీల పతనాన్ని శాసించాడు. విశాఖ పిచ్‌పై ఆఖరిరోజు మహ్మద్‌ షమి పదునైన బంతులను విసిరాడు. లంచ్‌ బ్రేక్‌లోపు 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న షమి... చివరి రెండు వికెట్లను రెండో సెషన్‌లో పడగొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. షమి వేసిన బంతికి వికెట్‌ విరిగిపోవడం అతని బౌలింగ్‌ వేగానికి మరో నిదర్శనం. ఆఫ్‌సైడ్‌ ఎడ్డ్‌ తీసుకున్న బంతి నేరుగా వికెట్లపైకి దూసుపోయింది. అందులో ఒక స్టంప్‌ ముక్కలైంది. దీన్ని భారత క్రికెట్‌ టీమ్‌ తన అధికారిక అకౌంట్‌లో కూడా పోస్ట్‌ చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో షమీ అదరగొట్టడం వెనుక ఉన్న సీక్రెట్‌ ఏమిటో రోహిత్‌ వెల్లడించాడు.
షమీ బిర్యానీ తినడమే తన అద్భుత గణాంకాలకు కారణమని చెప్పుకొచ్చాడు. 'బిర్యానీ తిన్న తర్వాత షమి ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. దాంతో అతడిలో అత్యుత్తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది' అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు
సోమవారం పుణె బయల్డేరడానికి ఇరుజట్ల క్రికెటర్లు సిద్ధమయ్యారు. అయితే టీమిండియా క్రికెటర్లను వర్షంలో తడిసేలా చేశారు అధికారులు. ప్లాట్‌ఫామ్‌-1పై నిలపాల్సిన బస్సును ప్లాట్‌ఫామ్‌-3పై నిలిపారు. దాంతో భారత క్రికెటర్లు ప్లాట్‌ఫామ్‌-3 నుంచి నడుచుకుంటూ ప్రత్యేక విమానం వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో లగేజీని మోసుకుంటూ ప్లాట్‌ఫామ్‌-1పైకి వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయమై అసహనం వ్యక్తం చేస్తూ... ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిం దంటూ రోహిత్‌ శర్మ నిలదీయడంతో నిర్వహకులు తమను సమర్ధించుకునే యత్నం చేశారు. ఎయిర్‌పోర్ట్‌ ఎంట్రీ మరమ్మత్తుల కారణంగానే కొన్ని అడుగుల దూరంలో బస్సును నిలిపివేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో భారత క్రికెటర్లు పుణెకు బయల్డేరారు. గురువారం నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD