సమ్మె బాటలో బంగ్లా క్రికెటర్లు

Mana Telangana

Mana Telangana

Author 2019-10-22 02:57:30

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని నిర్ణయించారు. సీనియర్ క్రికెటర్లు షకిబుల్ హసన్, ముష్పికుర్ రహీం, మహ్మదుల్లాతో సహా 50 మంది క్రికెటర్లు 11 డిమాండ్లతో సమ్మెకు వెలుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సమ్మె విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి)కి తెలిపారు. బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె చేయాలని నిర్ణయించడంతో వచ్చే నెలలో భారత్‌లో పర్యటించడం సందేహంగా మారింది. భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్ లు ఆడనుంది.

అయితే ఆటగాళ్లు సమ్మె చేయాలని నిర్ణయించడంతో భారత్‌లో పర్యటిస్తారా లేదా అనేది అనుమానమే. అయితే దీనిపై ఇప్పటి వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా, కొంతకాలంగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు, బోర్డుకు మధ్య వివాదం కొనసాగుతోంది. క్రికెటర్లు తమ వేతనాలు పెంచాల ని, కాంట్రాక్ట్ విధానంలో మార్పులు చేయాలని, క్రికెట్ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతూ బోర్డుకు నోటీసులు ఇచ్చారు. పెరిగిన ధరలు, ఖర్చుల నేపథ్యంలో క్రికెటర్లకు ఇస్తున్న ఫీజులను పెంచాల ని, క్రికెటర్లకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. అంతేగాక ప్రతిభావంతులైన క్రికెటర్లకు జాతీయ జట్టులో స్థానం దక్కెలా చూడాలని సూచిస్తున్నారు.

ఇక, తమ డిమాండ్లను పరిష్కరించనంత వరకు క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని రహీం, షకిబ్ తదితరులు స్పష్టం చేశారు. ఇక దీని పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందోననే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో వేతనాలకు సంబంధి క్రికెటర్లకు, బోర్డుకు మధ్య తలెత్తిన వివాదంతో వెస్టిండీస్ జట్టు భారీ మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసిందే. జింబాబ్వే కూడా బోర్డుతో గొడవ కారణంగా తెరమరుగై పోయింది. శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ క్రికెట్‌లో తలెత్తిన వివాదం ఆందోళన కలిగిస్తోంది. సాధ్యమైనంత త్వరగా బోర్డు ఈ సమస్య ను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే బంగ్లాదేశ్ క్రికెట్ కూడా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం ఖాయం.

Bangladesh cricketers go for indefinite strike

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD