సాంప్రదాయ టెస్ట్ వేదికల వైపే కొహ్లీ మొగ్గు

Teluguglobal

Teluguglobal

Author 2019-10-28 11:33:53

img

  • కొహ్లీ మాటపై క్రికెట్ మాజీల గరంగరం

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు దేశవ్యాప్తంగా ఆదరణ పెంచడం కోసం… ఓ వైపు బీసీసీఐ నానాపాట్లు పడుతుంటే…మరోవైపు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం.. దేశంలోని ఐదు సాంప్రదాయ టెస్టు వేదికల్లోనే మ్యాచ్ లు నిర్వహించాలని అభిప్రాయపడుతున్నాడు.

అయితే…టెస్ట్ వేదికలపై కొహ్లీ అభిప్రాయం తప్పంటూ.. బోర్డు మాజీ పెద్దలు మండిపడుతున్నారు. భారత క్రికెట్లో…బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాలు మాత్రమే 1990 దశకం వరకూ సాంప్రదాయ టెస్ట్ వేదికలుగా ఉంటూ వస్తున్నాయి.

జలంధర్, కటక్ లాంటి చిన్నాచితకా క్రికెట్ వేదికలకు సైతం టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం కల్పిస్తూ ఉండేవారు.
దాల్మియా, ఠాకూర్ నిర్ణయాలతో… ఆ తర్వాతి కాలంలో బోర్డు అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా, అనురాగ్ ఠాకూర్ ల హయాంలో టెస్ట్ వేదికల సంఖ్యను పదికి పెంచారు.

మొహాలీ, రాంచీ, నాగపూర్, కాన్పూర్, అహ్మదాబాద్, విశాఖపట్నం, పూణే, ధర్మశాల, ఇండోర్, రాజ్ కోట్, లాంటి వేదికలకు సైతం రొటేషన్ విధానం ద్వారా టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం కల్పించడం ప్రారంభించారు.

అయితే…చిన్నాచితకా వేదికల్లో సైతం టెస్ట్ మ్యాచ్ లకు అభిమానుల రాక అంతంత మాత్రంగా ఉండటం, జనంలేక స్టేడియాలు వెలవెలపోటం…కెప్టెన్ విరాట్ కొహ్లీకి చిర్రెత్తించింది.

రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ మొదటి మూడురోజులూ రెండు లేదా మూడువేల మంది అభిమానులు మాత్రమే హాజరయ్యారు. ఆట నాలుగోరోజున 17వేల 243, ఆఖరిరోజున 23వేల 869 మంది హాజరు కావడం పట్ల కొహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

తాము ఖాళీ స్టేడియాలలో మ్యాచ్ లు ఆడాల్సి వస్తోందని…పైగా కొత్తవేదికల్లో పిచ్ లు ఎలా ఉంటాయో తెలియక అయోమయానికి గురికావాల్సి వస్తోందని.. టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే…సాంప్రదాయ వేదికలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని కొహ్లీ అభిప్రాయపడ్డాడు.

పూణే, విశాఖపట్నం,రాంచీ వేదికలుగా తాము ఆడిన సిరీస్ కు ఆశించిన స్థాయిలో అభిమానులు హాజరుకాకపోడం పట్ల కొహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కొహ్లీ పై గరంగరం….

టెస్ట్ వేదికలపై కొహ్లీ అభిప్రాయాన్ని బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా తప్పు పట్టారు. భారత్ లాంటి సువిశాలదేశంలో టెస్ట్ క్రికెట్ ను కేవలం ఐదు వేదికలకు మాత్రమే పరిమితం చేస్తే…ఆదరణ ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. క్రికెట్ దేశవాప్తం కావాలంటే కేంద్రీకరణ కంటే వికేంద్రీకరణే మేలని తేల్చి చెప్పారు.

భారత ప్రత్యర్థి జట్లలో పసలేకపోడం, మ్యాచ్ లు ఏకపక్షంగా సాగటంతో జనం ఆసక్తి చూపడం లేదన్న వాస్తవాన్ని కెప్టెన్ కొహ్లీ గమనించాలని, ఏడాది పొడుగునా క్రికెట్ సిరీస్ లు నిర్వహిస్తూ ఉంటే అభిమానులు మాత్రం ఏం చేస్తారని, మితిమీరిన క్రికెట్ తో స్టేడియాలకు దూరంగా ఉంటున్నారని.. పంజాబ్ క్రికెట్ సంఘం కోశాధికారి ఆర్ పీ సింగ్లా అన్నారు. ఇంటిపట్టునే ఉండి టీవీల ద్వారా ప్రత్యక్షప్రసారం ద్వారా మ్యాచ్ లను వీక్షించడానికి అభిమానులు ప్రాధాన్యమిస్తున్నారని గుర్తు చేశారు.

మరి…టెస్ట్ వేదికలపై బీసీసీఐ నయా చైర్మన్ సౌరవ్ గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో మరి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD