సాకర్‌ సమరానికి సై!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 06:42:43

img

  • ఐఎస్ ఎల్‌-6 నేటి నుంచి
  • కేరళ-ఏటీకే మధ్య తొలి పోరు

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌-6 ఫుట్‌బాల్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం కొచ్చి వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌-ఏటీకే జట్లు తలపడనున్నాయి. లీగ్‌ దశలో ప్రతి జట్టు 18 మ్యాచ్‌లు ఆడనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 వరకు టోర్నీ జరగనుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ టీమ్‌ అరంగేట్రం చేస్తుండడంతో లీగ్‌లోని జట్ల సంఖ్య పదికి చేరింది. హైదరాబాద్‌ తన తొలి మ్యాచ్‌ను ఈనెల 25న ఏటీకేతో కోల్‌కతాలో ఆడనుంది. హోమ్‌ లెగ్‌లో భాగంగా సొంతగడ్డపై వచ్చే నెల 2న గచ్చిబౌలిలో కేరళతో తలపడనుంది. తొలిసారి టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్‌ ఆశలన్నీ స్పెయిన్‌ వెటరన్‌ ఫుట్‌బాలర్‌ రాఫెల్‌ లోపెజ్‌, ఆస్ట్రియా మిడ్‌ ఫీల్డర్‌ మార్కో స్టాంకోవిక్‌పైనే పెట్టుకుంది. ఇప్పటివరకు జరిగిన ఐదు సీజన్లలో ఏటీకే (కోల్‌కతా), చెన్నైయిన్‌ జట్లు రెండేసిసార్లు, బెంగుళూరు ఒకసారి విజేతగా నిలిచింది.

బెంగుళూరు, గోవా జట్లు ఈసారి హాట్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. డిఫెండింగ్‌ చాంప్‌ బెంగుళూరు భారత జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి, రాఫెల్‌ ఆగస్టో (బ్రెజిల్‌), ఆషికీ కురునియాన్‌ (భారత్‌) వంటి యువ ప్రతిభావంతులతో బలంగా కనిపిస్తోంది. గోవా విషయానికి వస్తే గోల్డెన్‌ బూట్‌ విన్నర్‌ ఫెర్రాన్‌ కొరోమినాస్‌ (స్పెయిన్‌) ఆ జట్టు ప్రధాన బలం. అతడు ఐఎ్‌సఎల్‌లో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 16 గోల్స్‌ సాధించాడు. ఫెర్రాన్‌తో పాటు ప్రముఖ మిడ్‌ ఫీల్డర్‌ అహ్మద్‌ జహోహ్‌ కూడా ఆ జట్టుకు కీలకం. రెండుసార్లు చాంపియన్‌ ఏటీకే గత సీజన్‌ను ఆరోస్థానంతో ముగించింది. దీంతో ఏటీకే మేనేజ్‌మెంట్‌ జట్టులో పలు మార్పులు చేసింది. పలువురు స్టార్‌ విదేశీ ఆటగాళ్లను తీసుకొని టీమ్‌ను బలోపేతం చేసింది. ఐఎ్‌సఎల్‌-4లో టైటిల్‌ కైవసం చేసుకున్న చెన్నైయిన్‌ గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టు రాణించేందుకు ఆ జట్టు భారీ కసరత్తు చేసింది.

ప్రముఖ బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, దిషా పటాని ఐఎ్‌సఎల్‌ ఆరంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు వీరి నృత్య ప్రదర్శనతో ఓపెనింగ్‌ సెర్మనీ ప్రారంభమవుతుంది. ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ముంబైకి చెందిన ‘కింగ్స్‌ యునైటెడ్‌’ డ్యాన్స్‌ గ్రూప్‌ కూడా ఈ వేడుకల్లో అలరించనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN