సూపర్ ఓవర్ మంచిదే

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-17 03:16:00

img
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మెగాటోర్నీల్లో ఫలితం తేల్చేందుకు వినియోగిస్తున్న బౌండ్రీల సంఖ్య నిబంధనను తొలగించడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఎక్కువ బౌండ్రీలు బాదిన జట్టును విజేతగా ప్రకటించకుండా ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్ నిర్వహించాలని ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని మాస్టర్ స్వాగతించాడు. ఇరుజట్లు సమానంగా నిలిచినప్పుడు విజేతను తేల్చేందుకు ఇది సరైన విధానమని భావిస్తున్నా అని సచిన్ ట్వీట్ చేశాడు.
దుబాయ్ వేదికగా సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఇకపై ఐసీసీ టోర్నీ నాకౌట్ స్టేజ్‌లో మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్‌ను నిర్వహించడంతో పాటు.. ఫలితం తేలేవరకు ఆ సూపర్ ఓవర్‌ను కొనసాగించనుంది. గ్రూప్ దశలో టై అయిన మ్యాచ్‌కు కూడా సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా టైగా ముగిస్తే.. మ్యాచ్‌ను టైగా ప్రకటిస్తారు. ఈ ఏడాది వేసవిలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇరు జట్ల స్కోర్లు సమంకాగా.. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. అయితే అందులోనూ స్కోర్లు సమానం కావడంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండ్రీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఈ నిబంధనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దిక్కుమాలిన నిబంధన అంటూ దుమ్మెత్తిపోయడంతో ఐసీసీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD