స్వింగ్‌ మాస్టర్‌ ఎక్కడీ

Nava Telangana

Nava Telangana

Author 2019-09-27 05:07:01

- టెస్టుల్లో కనిపించని భువనేశ్వర్‌
- దెబ్బతీసిన వరుస గాయాలు
- పరిమిత ఫార్మాట్‌కే పరిమితం!
నవతెలంగాణ క్రీడావిభాగం
2017 చాంపియన్స్‌ ట్రోఫీ, తర్వాత వెస్టిండీస్‌ పర్యటన తర్వాత ఓ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. బంతితో భారత జట్టు మేనేజ్‌మెంట్‌లో భిన్న ఫార్మాట్లకు భిన్నమైన సీమర్లతో వెళ్లాలని నిశ్చయించుకుంది. ఆ ఆలోచన భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు పేస్‌, స్పిన్‌ విభాగాల్లో భారత్‌కు పుష్కలమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎకానమీ రేట్‌, వికెట్ల వేటలో చాంపియన్స్‌ ట్రోఫీలో భారత టాప్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. భారత బౌలింగ్‌ ప్రణాళికల్లో భువనేశ్వర్‌ కుమార్‌ కీలక భాగం. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ (వన్డే, టీ20)లో జశ్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి భువనేశ్వర్‌ టాప్‌-2 బౌలర్లలో కొనసాగాడు. గాయాలు భువనేశ్వర్‌ను కొన్నిసార్లు టెస్టు క్రికెట్‌కు దూరం చేసినా, పిచ్‌ పరిస్థితుల నేపథ్యంలోనూ భువి ఎన్నోసార్లు బెంచ్‌కు పరిమితమయ్యాడు. పరిస్థితులు స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భువనేశ్వర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చటంలో ఎన్నడూ నిరాశపరచలేదు. అయితే, ఇదంతా భారత జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ పర్యటన వరకు మాత్రమే పరిమితం!. స్వదేశంలో మళ్లీ దక్షిణాఫ్రికా సిరీస్‌కు రంగం సిద్ధమైంది. నం.1 సీమర్‌ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. అయినా భారత పేస్‌ ప్రణాళికల్లో భువనేశ్వర్‌ కుమార్‌ పేరు వినిపించటం లేదు. ఎందుకు? స్వింగ్‌ మాస్టర్‌ సేవలు భారత్‌కు అక్కర్లేదా?!
సఫారీపై సూపర్‌ సవారీ : 2018 జనవరిలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌లోనే బుమ్రా టెస్టు అరంగేట్రం జరిగింది. కేప్‌టౌన్‌లో తొలి టెస్టులో భువనేశ్వర్‌ ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. కానీ భారత్‌ పరాజయం పాలైంది. రెండో టెస్టులో భువనేశ్వర్‌ బెంచ్‌కు పరమితమయ్యాడు. మూడో టెస్టులో తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. బంతితో వరుసగా 3/44, 1/39తో రాణించాడు. బ్యాట్‌తో 30, 33 పరుగులతో కీలక ప్రదర్శన చేశాడు. ఆ టెస్టులో భారత్‌ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. జొహనెస్‌బర్గ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు. జొహనెస్‌బర్గ్‌ టెస్టు ముగిసి 18 నెలలు గడిచింది. కానీ భువనేశ్వర్‌ కుమార్‌ మరో టెస్టులో కనిపించలేదు. తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లకు కనీసం భువనేశ్వర్‌ కుమార్‌ పేరును సైతం పరిగణనలోకి తీసుకోలేదు. దక్షిణాఫ్రికాతో స్వేచ్ఛా సమరానికి ముందు జశ్‌ప్రీత్‌ బుమ్రాకు గాయం కాగా, ఉమేశ్‌ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. భువనేశ్వర్‌ కుమార్‌ ప్రస్తావనే రాలేదు. అసలు జొహనెస్‌బర్గ్‌ టెస్టు తర్వాత ఏం జరిగింది?
ఇంగ్లాండ్‌లో గాయం : సఫారీతో టెస్టు సిరీస్‌ తర్వాత టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌ జోరు కొనసాగింది. టీ20ల్లో ఏడు వికెట్లు కూల్చి ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత కీలక సీమర్‌గా కనిపించాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌ టీ20, వన్డేలు ఆడింది. మూడో వన్డేలో భువనేశ్వర్‌ కుమార్‌ పాత గాయం తిరగబెట్టింది. దిగువ వెన్నుపూస గాయం మళ్లీ వేధించసాగింది. అంతకముందు ఐపీఎల్‌లోనూ అదే గాయంతో భువి డగౌట్‌కు పరిమితమయ్యాడు. శ్రీలంకలో జరిగిన నిదహాస్‌ (శ్రీలంక, బంగ్లాదేశ్‌, భారత్‌), అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌, భారత్‌ టెస్టు సిరీస రసపట్టులో సాగుతుంటే.. భువనేశ్వర్‌ బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. రెండు నెలల విరామం తర్వాత భువనేశ్వర్‌ ఆసియా కప్‌లో తిరిగి బంతి అందుకున్నాడు. అంతకముందే భువనేశ్వర్‌ తన ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. వరుస గాయాలతో బౌలింగ్‌ లయ తప్పుతుందని అభిప్రాయపడ్డాడు.
ఆసియాలో మెరుపులు : 2018 సెప్టెంబర్‌లో భువనేశ్వర్‌ తొలుత భారత్‌-ఏ తరఫున దక్షిణాఫ్రికా-ఏపై మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. 3/33 గణాంకాలతో రాణించాడు. తొలి స్పెల్‌లో ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కూల్చి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌, ఫామ్‌ చాటాడు. దీంతో ఆసియా కప్‌కు బయల్దేరిన భువనేశ్వర్‌ అక్కడ మరోసారి బుమ్రాతో కలిసి మ్యాజిక్‌ కొనసాగించాడు. 4.19 ఎకానమీతో పరుగుల పొదుపు, ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆసియా కప్‌ ప్రదర్శనతో భువనేశ్వర్‌ కుమార్‌ మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. బంతితో రిథమ్‌ దొరకబుచ్చుకున్నాడు.
ఆసియా కప్‌ తర్వాత భారత్‌ 2019 ప్రపంచకప్‌ ప్రణాళిక మొదలైంది. స్వదేశంలో వెస్టిండీస్‌పై వన్డేలు, ఆస్ట్రేలియాలో కంగారూలపై వన్డేలు, న్యూజిలాండ్‌ గడ్డపై వన్డేలు సహా స్వదేశంలో ఆస్ట్రేలియాపైనే వన్డేలు ఆడాడు. వికెట్ల వేటలో దాహం తీరలేదని చాటి చెప్పాడు. ఈ సమయంలోనే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌కు విశ్రాంతి లభించింది. జట్టులో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. 2-1తో భారత్‌ చారిత్రక విజయం సాధించిన సిరీస్‌లో బుమ్రా భారత బౌలింగ్‌ దళానాకి దళపతి. మహ్మద్‌ షమి విరామం లేని స్పెల్స్‌తో దూసుకొచ్చాడు. ఉమేశ్‌ యాదవ్‌ స్వదేశీ టెస్టులకు ప్రాధాన్య సీమర్‌ అయ్యాడు. వెస్టిండీస్‌పై రెండు టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌ శర్మ అప్పటికే టెస్టుల్లో రెగ్యులర్‌ సీమర్‌ అయిపోయాడు. ఈ సమయంలో భువనేశ్వర్‌ కుమార్‌ అసలు టెస్టు ప్రణాళికల్లో కనుమరుగయ్యాడు. 2018లో దక్షిణాఫ్రికాపై రెండు టెస్టులు మినహాయిస్తే.. 2016 నుంచి భువనేశ్వర్‌ కుమార్‌ కేవలం మూడు టెస్టుల్లోనే ఆడాడు. ఇది మరింత ఆశ్చర్యకరం.
వరల్డ్‌కప్‌లో మరో గాయం : ఇంగ్లాండ్‌కు వరల్డ్‌కప్‌ కోసం వెళ్లిన భువనేశ్వర్‌ కుమార్‌ను మరో గాయం వెంబడించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 2.4 ఓవర్లు వేసిన భువి.. తొడ కండరాలు పట్టేయటంతో మైదానం వీడాడు. వరల్డ్‌కప్‌లో తర్వాతి కొన్ని మ్యాచులకు భువి దూరమయ్యాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై మూడు వికెట్ల ప్రదర్శనతో భువి మెరిశాడు. కానీ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారత్‌ సెమీస్‌లోనే పరాజయం పాలైంది.
ఇటీవల కరీబీయన్‌ పర్యటనలో భారత వన్డే, టీ20 జట్టులో భువనేశ్వర్‌ సభ్యుడు. రెండో వన్డేలో నాలుగు వికెట్లు, మూడు టీ20ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ విషయంలో పరుగుల పొదుపు పాటించాడు. కానీ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ ఎంపిక కాలేదు. గత రెండేండ్లలో భువనేశ్వర్‌ కుమార్‌ కెరీర్‌ను గమనిస్తే.. గాయం, కోలుకోవటం, తిరిగి ఫామ్‌ సాధించటం... మళ్లీ గాయం.. ఫామ్‌ కోసం పోరాటం అన్నట్టు సాగుతోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం భువనేశ్వర్‌ కుమార్‌ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అందుకే దక్షిణాఫ్రికా సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ భువనేశ్వర్‌ కుమార్‌ ఇప్పుడు ఫిట్‌నెస్‌ సాధించినా జట్టులో అతని స్థానం ఏమిటనేది ప్రశ్నార్థకం. చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రకారం.. టెస్టుల్లో బుమ్రా, ఇషాంత్‌, షమి జట్టుకు కీలకం. బ్యాకప్‌లో ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని ఉంటారు. టీ20, వన్డేల్లో భువనేశ్వర్‌కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఉండనే ఉన్నారు. కొత్త కెరటం దీపక్‌ చాహర్‌ సైతం బ్యాకప్‌లో కొనసాగుతున్నాడని శాస్త్రి అన్నాడు. టెస్టు ప్రణాళికల్లో కనుమరుగైన భువనేశ్వర్‌ కుమార్‌ 2020 టీ20 ప్రపంచకప్‌ సమయానికి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కంగారూ గడ్డపై స్వింగ్‌కు అవకాశం ఎక్కువ, అందుకే భారత్‌కు సైతం భువనేశ్వర్‌ అవసరం ఎక్కువే.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD