స్వింగ్‌, స్పిన్‌కు సఫారీ ఖతం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-07 07:08:59

- నిప్పులు చెరిగిన మహ్మద్‌ షమి
- రవీంద్ర జడేజా మాయాజాలం
- ఛేదనలో దక్షిణాఫ్రికా 191 ఆలౌట్‌
- 203 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు
- 1-0తో ఫ్రీడం సిరీస్‌లో ఆధిక్యం
శ్రీనివాస్‌ దాస్‌ మంతటి నవతెలంగాణ - విశాఖపట్నం
విశాఖ టెస్టు టీమ్‌ ఇండియా వశం. పేసర్‌ మహ్మద్‌ షమి (5/35), స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (4/87) విజృంభణతో ఛేదనలో సఫారీ విలవిల్లాడింది. 395 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 191 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్‌ షమి నిప్పు రవ్వల్లాంటి బంతులతో బ్యాట్స్‌మన్‌ను ఖంగుతినిపించగా.. జడేజా మాయా వలలో సఫారీ కొట్టుమిట్టాడింది. విశాఖ టెస్టులో భారత్‌ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. 160 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మ్యాచ్‌ సాగేకొద్దీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. సఫారీ మదిలో ఎదురుదాడి ఆలోచన. తొలి ఓవర్లోనే షమిపై ఏడు పరుగులు రాబట్టుకున్నారు. దీంతో ఆఖరు రోజు తొలి ఓవర్‌ నుంచీ ఆసక్తి ఎక్కువైంది. సఫారీ ఆశలను షమి, జడేజా ఎంతోసేపు నిలువనీయలేదు. ఉదయం సెషన్లో పిచ్‌ స్వభావాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నారు. స్వింగ్‌, బౌన్స్‌తో పాటు లెంగ్త్‌లోనూ కచ్చితత్వం పాటించి వికెట్లపైకి దండయాత్ర చేశారు. పాత బంతితో షమి సూపర్‌ హిట్టు కొట్టగా, జడేజా ఒకే ఓవర్లో మూడు వికెట్లతో మాయ చేశాడు. తొలి టెస్టు విజయంతో భారత్‌ ఫ్రీడం సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు పుణె వేదికగా అక్టోబర్‌ 10 నుంచి ఆరంభం.
ఫ్రీడం సిరీస్‌ తొలి టెస్టులో భారత్‌ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పేసర్‌ మహ్మద్‌ షమి (5/35), స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (4/87) చెలరేగారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 191 పరుగులకు కుప్పకూలింది. 78/8తో ఓటమి అంచుల్లో నిలిచిన దక్షిణాఫ్రికా, టెయిలెండర్లు డేన్‌ పీట్‌ (56, 107 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), సెనురన్‌ ముతుసామి (49, 108 బంతుల్లో 5 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. కోహ్లిసేన విజయాన్ని లంచ్‌ సెషన్‌కు వాయిదా వేశారు. 11/1తో ఐదో రోజు ఆటకు వచ్చిన దక్షిణాఫ్రికా ఉదయం సెషన్లోనే ఏడు వికెట్లు కోల్పోయింది. రబాడ వికెట్‌తో 63.5 ఓవర్లలో మహ్మద్‌ షమి లాంఛనం ముగించాడు. సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది. మూడు మ్యాచుల సిరీస్‌లో తర్వాతి టెస్టులు వరుసగా పుణె, రాంచీ వేదికగా జరుగనున్నాయి. ఓపెనర్‌గా అరంగేట్ర టెస్టులోనే రెండు శతకాలు సాధించిన రోహిత్‌ శర్మ ' మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఏడు వికెట్లు కూల్చగా.. రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. రవీంద్ర జడేజా మ్యాచ్‌లో ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఇటు షమి, అటు జడేజా
ఓవర్‌నైట్‌ స్కోరు 11/1తో ఐదో రోజు ఛేదన పునప్రారంభించింది దక్షిణాఫ్రికా. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ తొలి ఓవర్లోనే సఫారీ పతనానికి నాంది పలికాడు. డీ బ్రూయిన్‌ (10)ను బుట్టలో వేసుకున్నాడు. ఆఫ్‌ కట్‌కు ప్రయత్నించిన బ్రూయిన్‌.. బంతి లోపలకు దూసుకొచ్చేసరికి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ వికెట్‌తో అశ్విన్‌.. 66 టెస్టుల్లోనే 350 వికెట్లు కూల్చిన దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ సరసన నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీయని సీమర్‌ మహ్మద్‌ షమి ఆఖరు రోజు అదరగొట్టాడు. బంతిని వికెట్‌కు ఇరు వైపులా స్వింగ్‌ చేసేలా కనిపించిన మహ్మద్‌ షమి తక్కువ బౌన్స్‌తో తెంబ బవుమా (0) వికెట్లను గిరాటేశాడు. షమి నుంచి అప్పటికే ఆ తరహా బంతిని ఎదుర్కొన్న బవుమా.. ఊహికందని లో బౌన్స్‌ బాల్‌తో వికెట్‌తో పాటు తనూ పిచ్‌పై పడిపోయాడు. బవుమా వికెట్‌ తీసిన తీరు ఐదో రోజు ఆటలో హైలైట్‌.
కెప్టెన్‌ డుప్లెసిస్‌ (13, 26 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఓపెనర్‌ ఎడెన్‌ మార్క్‌రం (39, 74 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) పది ఓవర్ల పాటు వికెట్ల పతనాన్నిన అడ్డుకున్నారు. ఈ సమయంలో మరోసారి మహ్మద్‌ షమి బంతి అందుకుని, కథ తిరగరాశాడు. వికెట్లకు నేరుగా బంతులేసిన మహ్మద్‌ షమి బౌన్సర్లతో పాటు సర్‌ప్రైజ్‌ కిల్లర్‌ లో బౌన్స్‌తో డుప్లెసిస్‌, క్వింటన్‌ డికాక్‌ (0)లను వరుస ఓవర్లలో వెనక్కి పంపాడు. బవుమా, డుప్లెసిస్‌, డికాక్‌లను ఒకే తరహా బంతులతో మహ్మద్‌ షమి క్లీన్‌బౌల్డ్‌గా సాగనంపాడు. ఆ తర్వాత లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా మాయాజాలం మొదలైంది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కూల్చి సఫారీ పతనాన్ని శాసించాడు. నాల్గో రోజు ఆఖర్లో డీన్‌ ఎల్గార్‌ (2)ను అవుట్‌ చేసిన జడేజా.. మరో ఓపెనర్‌ ఎడెన్‌ మార్క్‌రం (39)ను సూపర్బ్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. వెర్నన్‌ ఫిలాండర్‌ (0), కేశవ్‌ మహరాజ్‌ (0)లను ఒకే తరహా బంతితో జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 70/8తో దక్షిణాఫ్రికా లంచ్‌ లోపే కుప్పకూలేలా కనిపించింది. మహ్మద్‌ షమి ఒకే తరహా బంతితో మూడు వికెట్లు తీయగా.. జడేజా వరుస బంతుల్లో ఒకే రీతిలో రెండు వికెట్లు పడగొట్టాడు.
విసిగించిన పీట్‌, ముతుస్వామి
100 లోపే ఆలౌటయ్యేలా కనిపించిన దక్షిణాఫ్రికాను టెయిలెండర్లు ఆదుకున్నారు. టాప్‌ ఆర్డర్‌ను టపటపా కూల్చేసిన బౌలర్లు.. మరోసారి తోక కత్తిరించేందుకు ఇబ్బంది పడ్డారు. సెనురన్‌ ముతుసామి (49 నాటౌట్‌, 108 బంతుల్లో 5 ఫోర్లు), డేన్‌ పీట్‌ (56, 107 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) 9వ వికెట్‌కు ఏకంగా 91 పరుగులు జోడించారు. సుమారు 32 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడీ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. పీట్‌ అర్ధ సెంచరీ కొట్టగా, ముతుసామి 50 మార్క్‌కు చేరవయ్యాడు. డేన్‌ పీట్‌ను ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో షమి బౌల్డ్‌ చేసి విసిగించిన జోడీని విడదీశాడు. కగిసో రబాడ (18) మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ధనాధన్‌ ఆడాడు. రబాడను వికెట్ల వెనకాల క్యాచ్‌తో వెనక్కి పంపిన మహ్మద్‌ షమి ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు విశాఖ టెస్టులో గెలుపు క్రతువు పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులతో అజేయంగా నిలిచిన సెనురన్‌ ముతుసామి, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 502/7 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 431 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 323/4 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ : ఎడెన్‌ మార్క్‌రం (సి,బి) రవీంద్ర జడేజా 39, డీన్‌ ఎల్గార్‌ (ఎల్బీ) రవీంద్ర జడేజా 2, డీ బ్రూయిన్‌ (బి) అశ్విన్‌ 10, తెంబ బవుమా (బి) మహ్మద్‌ షమి 0, డుప్లెసిస్‌ (బి) మహ్మద్‌ షమి 13, క్వింటన్‌ డికాక్‌ (బి) మహ్మద్‌ షమి 0, సెనురన్‌ ముతుసామి నాటౌట్‌ 49, వెర్నన్‌ ఫిలాండర్‌ (ఎల్బీ) రవీంద్ర జడేజా 0, కేశవ్‌ మహరాజ్‌ (ఎల్బీ) రవీంద్ర జడేజా 0, డేన్‌ పీట్‌ (బి) మహ్మద్‌ షమి 56, కగిసో రబాడ (సి) సాహా (బి) షమి 18, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం : (63.5 ఓవర్లలో ఆలౌట్‌) 191.
వికెట్ల పతనం : 1-4, 2-19, 3-20, 4-52, 5-60, 6-70, 7-70, 8-70, 9-161-10-191.
బౌలింగ్‌ : రవిచంద్రన్‌ అశ్విన్‌ 20-5-44-1, రవీంద్ర జడేజా 25-6-87-4, మహ్మద్‌ షమి 10.5-2-35-5, ఇషాంత్‌ శర్మ 7-2-18-0, రోహిత్‌ శర్మ 1-0-3-0.
1:దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ సరసన అశ్విన్‌ నిలిచాడు. 350 వికెట్ల మైలురాయి అందుకున్న అశ్విన్‌కు ఇది 66వ టెస్టు మ్యాచ్‌. మురళీధరన్‌ సైతం 66వ టెస్టులోనే 350 వికెట్లు తీశాడు. వేగంగా 250 వికెట్ల రికార్డు సైతం అశ్విన్‌ (37)పేరిట ఉన్న సంగతి తెలిసిందే.
3:టెస్టుల్లో 200 ప్లస్‌ పరుగుల తేడాతో విజయం సాధించటం భారత జట్టుకు ఇది వరుసగా మూడోసారి కావటం విశేషం.
4:రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమి ప్రమాదకర సీమర్‌. కెరీర్‌లో ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. నాలుగుసార్లు రెండో ఇన్నింగ్స్‌లోనే కూల్చాడు. వైజాగ్‌ టెస్టులో షమి 5 వికెట్లు తీశాడు.
37:విశాఖ మ్యాచ్‌తో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్‌ శర్మ (13) సొంతమైంది. ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లతోనూ విశాఖ రికార్డు సృష్టించింది. భారత్‌, దక్షిణాఫ్రికా ఏకంగా 37 సిక్సర్లు కొట్టాయి.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN