హజారే విజేత కర్ణాటక

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-26 06:21:00

-అభిమన్యు మిథున్ హ్యాట్రిక్
-ఫైనల్లో తమిళనాడుపై విజయం
-నాలుగోసారి టైటిల్ కైవసం
కర్ణాటక జట్టు మళ్లీ మెరిసింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తుది పోరులో కన్నడ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది. బర్త్‌డే బాయ్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్‌కు తోడు లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అర్ధసెంచరీలతో కర్ణాటక విజయాన్నందుకుంది. బ్యాటింగ్‌లో ఓ మోస్తారుగా రాణించిన కార్తీక్‌సేన..బౌలింగ్‌లో తేలిపోయింది.
imgబెంగళూరు: విజయ్ హజారే వన్డే టోర్నీ టైటిల్‌ను కర్ణాటక కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక 60 పరుగుల తేడాతో (వీజేడీ పద్ధతి)లో తమిళనాడుపై విజయం సాధించింది. హజారే టైటిల్‌ను దక్కించుకోవడం కర్ణాటకకు ఇది నాలుగో సారి. గతంలో 2013-14, 2014-15, 2017-18లో టైటిల్ సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన కర్ణాటక.. తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ అభినవ్ ముకుంద్ (85), బాబా అపరాజిత్ (66) అర్ధసెంచరీలతో 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసింది. వీరికి తోడు విజయ్ శంకర్(38), షారుఖ్ ఖాన్ (27) ఫర్వాలేదనిపించారు. అభిమన్యు మిథున్ (5/34) హ్యాట్రిక్‌తో సహా ఐదు వికెట్లు పడగొట్టాడు. వర్షం అంతరాయంతో కుదించిన లక్ష్యాన్ని కర్ణాటక వికెట్ కోల్పోయి విజయాన్నందుకుంది. ఓపెనర్ రాహుల్ (52 నాటౌట్), అగర్వాల్ (69 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. ఏకైక వికెట్ సుందర్(1/51)కు దక్కింది. అభిమన్యు మిథున్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.

మిథున్ హ్యాట్రిక్:

తొలుత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు ఆదిలోనే మురళీ విజయ్(0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి విజయ్ పరుగుల ఖాతా తెరువకుండానే నిష్క్రమించాడు. మూడో నంబర్‌లో వచ్చిన అశ్విన్(8) కూడా విజయ్‌ను అనుసరించాడు. ఆ తర్వాత ముకుంద్, అపరాజిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు కలిసి కర్ణాటక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. ముఖ్యంగా ముకుంద్ మైదానం నలువైపులా చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అపరాజిత్‌ను అండగా చేసుకుంటూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 68 బంతుల్లో ముకుంద్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అపరాజిత్ వీలు చిక్కినప్పుడల్లాబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ జోరు అందుకుంటున్న తరుణంలో ముకుంద్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్(11), సుందర్(2)నిరాశపరుచగా, శంకర్(38), షారుఖ్ ఖాన్(27) అంతోఇంతో ఆకట్టుకున్నారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్‌కు దిగిన మిథున్..ఆఖరి మూడు బంతుల్లో వరుసగా షారుఖ్ ఖాన్, మహమ్మద్(10), మురుగన్ అశ్విన్(0)ను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేశాడు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మిథున్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కాగా, కెరీర్‌లో ఇది తొలి హ్యాట్రిక్.
img

లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కర్ణాటకకు మెరుగైన ఆరంభం దక్కింది. ఓపెనర్ దేవదూత్ పడిక్కల్(11) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా..రాహుల్, అగర్వాల్ అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కారు. తమదైన ఫామ్‌ను కొనసాగిస్తూ బౌండరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.

సంక్షిప్త స్కోర్లు: తమిళనాడు: 49.5 ఓవర్లలో 252 ఆలౌట్(ముకుంద్ 85, అపరాజిత్ 66, మిథున్ 5/34, కౌశిక్ 2/39), కర్ణాటక: 23 ఓవర్లలో 146/1(రాహుల్ 52 నాటౌట్, అగర్వాల్ 69 నాటౌట్, సుందర్ 1/51)

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD