హిట్‌మ్యాన్ రోహిత్‌పైనే దృష్టంతా..!

Newwaves

Newwaves

Author 2019-09-26 07:42:00

img

విజయనగరం: పర్యాటక దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్ విజయనగరంలో గురువారం మొదలవుతోంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సీరీస్ ద్వారా టెస్ట్‌ మ్యాచ్ జట్టులో నిలదొక్కుకోవడానికి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఇదొక సదవకాశం వచ్చింది. బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్లుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోహిత్ ఈ సన్నాహక మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడనే దానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. టీ 20 సీరీస్‌ను 1-1తో సమంగా పంచుకున్న ఇరు జట్లూ టెస్టు మ్యాచ్‌లకు రెడీ అవుతున్నాయి. ఈ సీరీస్‌లో భాగంగా అక్టోబర్ 2న విశాఖపట్నంలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సీరీస్‌కు సన్నాహకంగా ఇరు జట్ల మధ్య గురువారం విజయనగరంలో సన్నాహక మ్యాచ్ జరుగుతుంది.

నిజానికి ఒకరి తరువాత మరొక కుర్రాడు టీమిండియాలోకి దూసుకొస్తున్న సమయంలో రోహిత్‌కు ఇప్పుడు దొరికిన ‘టెస్టు’ అవకాశం బహుశా చివరిదనే అనుకోవాలి. ఈ 32 ఏళ్ళ హిట్‌మ్యాన్ దీర్ఘ ఫార్మాట్లో అలవాటు లేని ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్‌గా రానుండటంతో అందరి కళ్లూ అతడిపైనే ఉన్నాయి. ఓ బ్యాట్స్‌మన్‌గా పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో స్ట్రోక్ ప్లేతో పరుగుల వరద పారిస్తున్నా.. ఎర్ర బంతిని ఎదుర్కోవడంలో తడబాటు రోహిత్‌ను సంప్రదాయ ఫార్మాట్‌లో సాధారణ ఆటగాడిగా మార్చేసింది. ప్రస్తుతం ఆ వైఫల్యాల జ్ఞాపకాలను చెరిపేసే మార్గం హిట్‌మ్యాన్‌ ముందు నిలిచింది. ప్రత్యర్ధి జట్టులోని మెరుగైన బౌలింగ్‌ వనరులకు ఎదురు నిలిచి రాణిస్తే టెస్టు సీరీస్‌కు ముందు రోహిత్‌లో ఆత్మవిశ్వాసం పెరగడం తథ్యం. మరోవైపు డు ప్లెసిస్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికా బాగా సన్నద్ధమైంది.imgరోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ విజయనగరం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారు. దక్షిణాఫ్రికాపై మూడు టెస్టుల సీరీస్‌లో టీమిండియా తరఫున వీరే ఓపెనర్లు. తొలిసారి జోడీగా దిగుతున్న వీరికి రబడ, ఫిలాండర్, ఇన్‌గిడి లాంటి సఫారీ బౌలర్లను ముందే ఆడనుండటం సానుకూలాంశం. సమన్వయం రీత్యా కూడా మంచి సన్నాహకం దొరికినట్లే. స్వతహాగా ఓపెనర్లయినా.. కూర్పు ప్రకారం ప్రియాంక్‌ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరే బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఇటీవల నిలకడగా ఆడుతున్న కరుణ్‌ నాయర్, సిద్దేశ్‌ లాడ్, ఆంధ్రా వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌లతో బోర్డు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. గాయపడిన బుమ్రా స్థానంలో సఫారీ టెస్టు సీరీస్‌కు ఎంపికైన ఉమేశ్‌ యాదవ్‌ పేస్‌తో పాటు ఇషాన్‌ పొరెల్, అవేష్‌ ఖాన్‌లు తమ పేస్‌ సత్తా చాటేందుకు ఈ మ్యాచ్‌ ఓ వేదికగా నిలుస్తుంది. జలజ్‌ సక్సేనా, ధర్మేంద్ర  జడేజా స్పిన్‌తో ప్రొటీస్‌ పని పట్టగల సత్తా ఉన్నవారే.

వన్డే ప్రపంచ కప్‌ తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్‌ తొలిసారి మైదానంలోకి దిగుతున్నాడు. అతడికి టెస్టుల్లో స్థానం నిలవాలంటే రాబోయే మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ఓపెనర్‌ మార్క్‌రమ్‌ ‘ఎ’ జట్టు తరఫున భారీ సెంచరీ కొట్టి ఫామ్‌లో ఉన్నట్లు చాటుకున్నాడు. ఎల్గర్, బవుమా, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ డికాక్‌ తదితరులతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది.  చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతున్న ఫిలాండర్‌ సఫారీల ప్రధాన పేసర్‌. టి20 సీరీస్‌లో విఫలమైన రబడ అసలు సమరం నాటికి పుంజుకోవాలని చూస్తున్నాడు. కేశవ్‌ మహరాజ్, ముత్తుస్వామిల స్పిన్‌ ఏ మేరకు సవాల్‌ విసురుతుందో చూడాలి.

అయితే.. తొలిసారిగా అంతర్జాతీయ సన్నాహక క్రికెట్‌ మ్యాచ్‌కు వేదికవుతున్న విజయనగరం మైదానంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడేలా కనిపిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నందున అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ.. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచీ వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి కూడా వాన పడింది. నిర్వాహకులు మాత్రం వర్షం విరామం ఇస్తే గంటలోనే మ్యాచ్‌ను ప్రారంభిస్తామని చెబుతున్నారు.

జట్ల వివరాలు:
బోర్డు ఎలెవెన్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, ప్రియాంక్‌ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్‌ నాయర్, సిద్దేశ్‌ లాడ్, కేఎస్‌ భరత్, జలజ్‌ సక్సేనా, ధర్మేంద్ర సింగ్‌ జడేజా, అవేష్‌ ఖాన్, ఇషాన్‌ పొరెల్, శార్దుల్‌ ఠాకూర్, ఉమేశ్‌ యాదవ్‌.

దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), బవుమా, డి బ్రుయెన్, డి కాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్‌ మహరాజ్, మార్క్‌రమ్, సెనురాన్‌ ముతుస్వామి, ఇన్‌గిడి, నోర్టె, ఫిలాండర్, పీట్, రబడ, రూడీ సెకండ్‌.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN