‘తొలి’ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-19 06:43:41

img

  • నేటి నుంచి దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు
  • జోరు మీదున్న భారత్‌

సొంత గడ్డపై భారత జట్టు ఎదురు లేకుండా దూసుకెళుతోంది. అంతేకాకుండా దక్షిణాఫ్రికాపై ఇప్పటికే 2-0తో సిరీస్‌ అందుకుంది. గతంలో ఇలాంటి పరిస్థితిలో చివరి మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఉండేది కాదు. మహా అయితే రిజర్వ్‌ బెంచీని పరీక్షించేందుకు సిద్ధమయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతీ టెస్టు విజయం కూడా టెస్టు చాంపియన్‌షి్‌పలో కీలకమే కావడంతో కోహ్లీ సేన మరింత కసితో బరిలోకి దిగబోతోంది. ఇప్పటిదాకా టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను భారత జట్టు

క్లీన్‌స్వీ్‌ప చేయలేదు. ఇప్పుడా లోటును అధిగమించడంతో పాటు విలువైన 40 పాయింట్లను ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అటు పర్యాటక జట్టు కనీసం డ్రాతోనైనా పరువు కాపాడుకోవాలనుకుంటోంది.

రాంచీ: ఐసీసీ టెస్టు చాంపియన్‌షి్‌ప ఆరంభమయ్యాక ఇక టెస్టు సిరీ్‌సల్లో ఏ మ్యాచ్‌ కూడా ‘డెడ్‌ రబ్బర్‌’గా భావించలేని పరిస్థితి. అందుకే శనివారం నుంచి రాంచీలో జరిగే చివరి టెస్టు కూడా హోరాహోరీగానే సాగే అవకాశముంది. రెండో టెస్టు విజయానంతరం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. చివరి టెస్టులోనూ తమ ఆటతీరులో మార్పు ఉండదని తెలిపాడు. దక్షిణాఫ్రికా మాత్రం కేశవ్‌ మహరాజ్‌, మార్‌క్రమ్‌ గాయాల కారణంగా మరీ బలహీనంగా తయారైంది. ప్రస్తుతం టెస్టు చాంపియన్‌షి్‌ప పట్టికలో భారత్‌ (4 మ్యాచ్‌లు) ఖాతాలో అత్యధికంగా 200 పాయింట్లున్నాయి. అటు కివీస్‌, శ్రీలంక (రెండేసి మ్యాచ్‌లు) కేవలం 60 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 240 పాయింట్లతో తిరుగులేని స్థాయిలో ఉంటుంది.

సూపర్‌ ఫామ్‌లో భారత్‌

భారత లైనప్‌ అత్యంత పటిష్ఠంగా ఉంది. బ్యాట్స్‌మెన్‌ నుంచి పరుగుల వరద పారుతుండగా బౌలర్లు వికెట్ల వేటలో ముందున్నారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ రెండేసి సెంచరీలతో జట్టుకు కావాల్సిన శుభారంభాలు అందిస్తుండడంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. రెండు టెస్టుల్లోనూ ప్రత్యర్థి బౌలర్లు భారత్‌ను ఆలౌట్‌ చేయలేకపోయారు. మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 16 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇక విరాట్‌ కోహ్లీ పుణె టెస్టులో డబుల్‌ సెంచరీతో వహ్వా అనిపించాడు. మరోవైపు రెండు అర్ధసెంచరీలు సాధించినా పుజారా భారీ స్కోరుపై కన్నేశాడు. అటు రహానె, జడేజా అర్ధసెంచరీలతో మెరిశారు. వికెట్‌ కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహా అద్భుత క్యాచ్‌లతో కీలకంగా నిలుస్తున్నాడు. బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా చెలరేగడం భారత్‌కు శుభపరిణామం. తొలి టెస్టులో అశ్విన్‌తో పాటు పేసర్‌ షమి కూడా సత్తా చూపాడు. రెండో టెస్టులో తనకు దక్కిన చాన్స్‌ను మరో పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీసి చక్కగా వినియోగించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో విహారి స్థానంలో ఉమేశ్‌ను తీసుకున్న కోహ్లీ రాంచీలోనూ అతడిని కొనసాగిస్తాడా లేక మూడో స్పిన్నర్‌ మేలని భావిస్తాడా అనేది వేచిచూడాల్సిందే.

గాయాలతో కుదేలు

ఏ విభాగంలోనూ పోటీ ఇవ్వలేకపోతున్న సఫారీలకు చివరి టెస్టు ఆరంభానికి ముందే గాయాల బెడదను ఎదుర్కొంటోంది. ఓపెనర్‌ మార్‌క్రమ్‌తో పాటు స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ గాయాల కారణంగా ఆటకు దూరమయ్యారు. వీరి స్థానంలో డేన్‌ పీట్‌, జుబేర్‌ హమ్‌జా రానున్నారు. ఇక విశాఖ టెస్టులో జట్టు బ్యాట్స్‌మెన్‌ నుంచి కాస్త పోరాటం కనిపించింది. కానీ, పుణెలో పూర్తిగా చేతులెత్తేశారు. ఎల్గర్‌, డికాక్‌, బవుమా బాధ్యతతో బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరముందని కెప్టెన్‌ డుప్లెసి అభిప్రాయపడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. కగిసో రబాడ, ఫిలాండర్‌, నోర్టేలతో కూడిన పేస్‌ విభాగం కూడా పూర్తిగా విఫలమైంది. ఇన్ని సమస్యలతో చివరి టెస్టులో విజయం సంగతి పక్కనబెడితే ప్రొటీస్‌ కనీసం డ్రా చేసుకున్నా మంచి ఫలితం సాధించినట్టే అవుతుంది.

టాస్‌కు నేను రాను!

ఒకటి కాదు... రెండు కాదు వరుసగా ఆసియాలో ఆడిన తొమ్మిది టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసి టాస్‌ను గెలవలేకపోయాడు. దీంతో మ్యాచ్‌ ఆరంభానికి ముందు టాస్‌ కోసం తాను కాకుండా మరొకరిని పంపేందుకు నిర్ణయించుకున్నాడు. ‘టాస్‌ విషయంలో నన్ను దురదృష్టం వెంటాడుతోంది. అందుకే నేను వెళ్లకుండా మరొకరిని పంపాలనుకుంటున్నా. ఒకవేళ టాస్‌ గెలిచి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధిస్తే మా విజయావకాశాలు మెరుగుపడతాయి’ అని డుప్లెసి అన్నాడు.

కుల్దీప్‌ అవుట్‌.. నదీమ్‌ ఇన్‌

భుజం నొప్పి కారణంగా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చివరి టెస్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో బెంచీకే పరిమితమైన అతడి స్థానంలో స్థానిక లెఫ్టామ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ను తీసుకున్నారు. జార్ఖండ్‌, భారత్‌ ‘ఎ’ తరఫున నదీమ్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 2018లోనూ అతడు విండీ్‌సతో టీ20 సిరీ్‌సకు ఎంపికైనా ఆడే అవకాశం రాలేదు. ఈసారి పిచ్‌ టర్న్‌ అయ్యే అవకాశం కనిపిస్తుండగా తుది జట్టులో నదీమ్‌కు చోటు దక్కినా ఆశ్యర్యం లేదు.

జట్లు (అంచనా)

భారత్‌: మయాంక్‌, రోహిత్‌, పుజారా, కోహ్లీ, రహానె, జడేజా, సాహా, అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేష్‌/నదీమ్‌, షమి.

దక్షిణాఫ్రికా: ఎల్గర్‌, హమ్‌జా, డి బ్రుయిన్‌, డుప్లెసి, బవుమా, డికాక్‌, ముత్తుస్వామి, ఫిలాండర్‌, నోర్టే/ఎన్‌గిడి, పీట్‌, రబాడ.

పిచ్‌, వాతావరణం

రెండేళ్ల క్రితం ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మాదిరే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. అలాగే స్పిన్నర్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే మ్యాచ్‌ జరిగే ఐదు రోజులు ఆకాశం మేఘావృతంగానే ఉండనుంది. చివరి రెండు రోజులు ఆటకు అంతరాయం కలగొచ్చు.

మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా రెండుసార్లు మాత్రమే (ఆసీస్ పై 2002, 2006లో) వైట్‌వాష్‌ అయ్యింది.

రోహిత్‌ శర్మ మరో నాలుగు సిక్సర్లు బాదితే ఈ ఏడాది ఎక్కువ సిక్సర్లు కొట్టిన స్టోక్స్‌ (15)ను అధిగమిస్తాడు.

విరాట్‌ కోహ్లీ మరో 44 పరుగులు చేస్తే టెస్టుల్లో 5వేల పరుగులు పూర్తి చేసిన ఆరో కెప్టెన్‌గా నిలుస్తాడు.

ధోనీ వస్తున్నాడు!

రాంచీలో జరగబోయే ఈ టెస్టుకు లోకల్‌ బాయ్‌, మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడి మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ ధృవీకరించాడు. ‘మహీ కచ్చితంగా మ్యాచ్‌ను చూసేందుకు వస్తాడు. తొలి రోజున మీరంతా అతడిని చూడబోతున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ధోనీ నేటి ఉదయం రాంచీకి చేరుకుంటాడు. ఇక, క్రికెట్‌కు సంబంధించి ధోనీ తీసుకునే నిర్ణయాలపై ఎవరికీ అవగాహన లేదు. అది పూర్తిగా అతడి వ్యక్తిగతం’ అని దివాకర్‌ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా టీమిండియా ఆటగాళ్లకు తన విశాలమైన ఫార్మ్‌హౌ్‌సలో ధోనీ విందు ఇవ్వనున్నాడు. మరోవైపు జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం కూడా ఈ మ్యాచ్‌కు రావాల్సిందిగా ఎంఎ్‌సకు ప్రత్యేక ఆహ్వానం పలికింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD