15, 29 తేదీల్లో వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-11 08:24:47

తిరుపతి, అక్టోబర్ 10: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 15, 29 తేదీలలో మంగళవారం వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు 4000 టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు 1000, మధ్యాహ్నం 2000 టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు 1000 టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి రెండు స్లాట్‌లకు సంబంధించిన టిక్కెట్లు కేటాయిస్తారు. భక్తులు ముందుగా వచ్చి టోకెన్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈనెల 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN