3rd Test Day 1 in Ranchi: నదీమ్‌ టెస్టు అరంగేట్రం, టీమిండియా బ్యాటింగ్

mykhel

mykhel

Author 2019-10-19 11:53:03

img

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టుకు టీమిండియా సన్నద్ధమైంది. రాంచీలోని జేఎస్‌సీఏ మైదానం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు శనివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత్ తరుపున లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్‌ నదీమ్‌ టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు. చాలాకాలంగా నదీమ్‌ జార్ఖండ్‌ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. రంజీల్లో వరుసగా రెండు సీజన్లలో వరుసగా 50కిపైగా వికెట్లు పడగొట్టాడు.

జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్‌-ఏతో అనధికారిక సిరీస్‌లో భాగంగా భారత-ఏ జట్టు తరఫున నదీమ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 110 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 424 వికెట్లు సాధించాడు. రాంచీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్‌ను పక్కకు పెట్టి షాబాజ్‌ నదీమ్‌‌కు తుది జట్టులో చోటు కల్పించారు.

ఇప్పటికే విశాఖ టెస్టులో 203 పరుగులు, పుణె టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. రాంచీ టెస్టులో టీమిండియా గెలిస్తే దక్షిణాఫ్రికాను వైట్‌వాష్‌ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది.

మూడు లేదా అంతకుమించి మ్యాచ్‌ల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్ అవుతుంది. దీంతో సఫారీలను క్లీన్‌స్వీప్‌ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది. 2015లో నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షంవల్ల డ్రా కావడంతో 3-0తో సిరీస్ గెలిచినా ఈ రికార్డు భారత్‌కు దక్కలేదు.

అంతేకాదు ఈ మ్యాచ్ గెలిచి టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రస్తుతం టీమిండియా 160 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతోన్న సఫారీలు చివరి పోరులోనైనా సత్తా చాటి పరువు కాపాడుకోవాలనుకుంటున్నారు.

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ రికార్డుని అధిగమించాలంటే రోహిత్ శర్మ మరో మూడో సిక్సర్లు సాధించాలి. స్టోక్స్ 16 ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు కొడితే.. రోహిత్ ఈ సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లోనే 13 సిక్సర్లను బాదాడు.

ఇక, కెప్టెన్‌గా టెస్టుల్లో 5వేల పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ 4 పరుగుల దూరంలో ఉన్నాడు. మరో రికార్డు టీమిండియాను ఊరిస్తోంది. టెస్టుల్లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా... భారత్‌లో జరిగిన టెస్టుల్లో మాత్రం టీమిండియాదే పైచేయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా ఒకే ఒక్క సిరిస్‌ను కోల్పోయింది. మొత్తంగా ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికా 15 విజయాలు సాధించగా, భారత్‌ 13 విజయాలు సాధించింది.

ధోనీ హాజరు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ వేదికగా జరిగే ఈ మూడో టెస్టుకు హాజరుకానున్నాడు. తొలిరోజు ఆటను ధోని ప్రత్యక్షంగా వీక్షిస్తాడని అతడి వ్యక్తిగత మేనేజర్ మిహిర్ దివాకర్ వెల్లడించాడు. శుక్రవారం ముంబైలో ఉన్న ధోనీ ఈ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు శనివారం ఉదయం రాంచీ చేరుకున్నాడు.

జట్ల వివరాలు:

భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, ఉమేశ్, నదీమ్‌

దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెప్టెన్), ఎల్గర్, హమ్జా, డిబ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, ముత్తుసామి, రబడ, పీట్, ఇన్‌గిడి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN